రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్) తర్వాత తన తదుపరి చిత్రం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి స్పష్టం చేశారు. నిర్మాత కేఎల్ నారాయణ, మహేశ్, తన కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఎప్పట్నుంచో చెబుతున్నానని, డీవీవీ దానయ్య చిత్రం తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత జక్కన్న ప్రభాస్‌తో మరో చిత్రం లేక ఈగ సీక్వెల్ చేస్తాడని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం గురించి స్పష్టతనివ్వడంతో రూమర్స్‌కు చెక్ పడింది.
ఇక రాజమౌళి-మహేశ్ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని అనధికారికంగా తెలిసినా.. ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మహేశ్ సినిమాపై దర్శకధీరుడు స్పష్టతనిచ్చాడు. ఈ సినిమాపై జక్కన్న తొలిసారి స్పందించడంతో మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాకుండా మహేశ్ కోసం జక్కన్న ఏ కథను సిద్దం చేస్తున్నాడనే ఆసక్తిని కూడా కనబరుస్తున్నారు.