ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ

మెలనియా గ్లామర్‌ మోడల్‌. ట్రంప్‌ తొలిసారి 1998లో మెలనియాను న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో చూశాడు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అతడి వయసు 52 ఏళ్లు. ఇద్దరికీ ఇరవై నాలుగేళ్లు తేడా. బిజినెస్‌మ్యాన్‌. టెలివిజన్‌ పర్సనాలిటీ. అప్పటికే రెండో భార్యతో వేరుగా ఉంటున్నాడు. ‘వావ్‌.. ఎవరీ అమ్మాయి!’ అని ఆరా తీశాడు. మనమ్మాయి కాదు, స్లొవేనియా మోడల్‌ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. అంతకు రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు న్యూయార్క్‌ వచ్చినట్లు చెప్పింది మెలనియా. ఫోన్‌ నెంబర్‌ అడిగాడు. మెలనియా ఇవ్వలేదు! అతడి పక్కనే సెలీనా మిడెల్‌ఫార్ట్‌ అనే అమ్మాయి ఉంది. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి ఫోన్‌ నెంబర్‌ అడుగుతాడేంటి అని కోపం వచ్చి నెంబర్‌ ఇవ్వలేదు. ట్రంప్‌ వదిలిపెట్టలేదు.



మెలనియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. చివరికి ‘ఎస్‌’ అంది. తర్వాత కొన్నాళ్లకు ‘నో’ అంది. అలా కొంతకాలం ‘ఎస్‌’లు, ‘నో’ లతో వాళ్ల రిలేషన్‌ నడిచింది. ఫస్ట్‌ టైమ్‌ ‘హోవార్డ్‌ స్టెర్న్‌ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తర్వాత ఇద్దరూ పక్కపక్కనే బహిరంగంగా నడుస్తూ బయటపడ్డారు. తమ రిలేషన్‌ గురించి ట్రంప్‌ 2005లో ఓ టీవీ చానెల్‌లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. ఆ ముందు ఏడాదే వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలనియా తల్లి అయింది. కొడుకు పుట్టాడు.